మలైకా అరోరా, అర్జున్ కపూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకన్నా చిన్నవాడిని ప్రేమిస్తూ ఆమె, తనకన్నా పెద్దావిడను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ అతను, ఎప్పటి నుంచో బాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. ఎయిర్‌పోర్టు లుక్స్ లోనూ, హాలీడే స్పాటుల్లోనూ, రొమాంటిక్ ట్రిప్స్ లోనూ, సోషల్ మీడియా - పబ్లిక్ అప్పియరెన్సుల్లోనూ ఇద్దరూ కలిసే మనసులను కొల్లగొట్టేస్తుంటారు. మనసుకు నచ్చినట్టు ఉండాలంటారు మలైకా. చెప్పడమే కాదు, చేసి చూపిస్తుంటారు. ఇండస్ట్రీలో పాతికేళ్ల అనుభవం ఆమె సొంతం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఇప్పుడు సౌత్ మీద ఫోకస్ చేస్తుంటే, ఎప్పుడో స్పెషల్ సాంగులతో సౌత్ ఆడియన్స్ ని కవర్ చేసేసిన నటి మలైకా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి విషయాలను చాలానే చెప్పారు మలైకా. అంతే కాదు, పెళ్లి గురించి ఆమె చెప్పిన మాటలు కూడా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి.
``నేను జీవితంలో చాలా మంచి దశలో ఉన్నాను. చాలా హాయిగా అనిపిస్తోంది. అర్జున్‌తో నా జీవితాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నాను. నేను పెళ్లికి దూరంగా ఉంటానని చాలా మంది అనుకోవచ్చు. కానీ అందులో నిజం లేదు. నాకు వివాహ వ్యవస్థ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. ప్రేమలో, ఒకరి సాంగత్యంలో తప్పకుండా మనం ఆనందంగా ఉంటామనే విశ్వాసం ఉంది. అయితే నేను పెళ్లి ఎప్పుడు చేసుకుంటాననే విషయం మీద క్లారిటీ లేదు. ఎందుకంటే జీవితంలో మనం అదేపనిగా ప్లానింగ్ చేస్తున్నామని ఏదీ జరగదు. ఎప్పుడు ఎలా జరగాలో, అలా జరిగితీరుతుంది. అందుకే దేన్నీ ఎక్కువ ప్లానింగ్ చేయకూడదు. ప్లానింగ్ చేస్తూ కూర్చుంటే, ఉన్న క్షణాలను ఆస్వాదించలేం. అది నాకు నచ్చదు`` అని అన్నారు.
2019లో తమ మధ్య ఉన్న బంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యక్తం చేశారు మలైకా, అర్జున్. ``అతను తన వయసును మించిన పరిపక్వతతో ఉన్నాడు. చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇంకో 30 ఏళ్లు అతనితో ఇలాగే ఉండాలనిపిస్తోంది. నాకు రకరకాల బిజినెస్‌లు చేసి డబ్బు కూడగట్టాలని లేదు. నాకు ప్రయాణం చేయాలనిపిస్తోంది. అర్జున్‌తో ఓ ఇంట్లో ఉండాలనిపిస్తోంది. అతనితో బంధాన్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్లాలనిపిస్తోంది`` అని అన్నారు మలైకా.